జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

  • డీఎస్సీ నియామకాల్లో కూడా జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారన్న భూమిరెడ్డి
  • వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉందని వ్యాఖ్య
  • కేంద్రం ఆమోదించిన ఆటల జాబితానే పోర్టల్ లో ఉంచామని వెల్లడి

పారదర్శకంగా జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కూడా వైసీపీ అధినేత జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రతి ఆరోపణను ఆధారాలతో నిరూపిస్తుంటే, జగన్ కళ్లున్నా చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్లు వారి వ్యవహారశైలి ఉందన్నారు.


ఎస్‌సీఈఆర్టీ (SCERT) నిపుణుల ప్రత్యేక భద్రత నడుమ, గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన అభ్యంతరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డీఎస్సీ 'ఫైనల్ సెలక్షన్ లిస్ట్' అత్యంత పారదర్శకంగా, ఆన్‌లైన్‌లో విడుదల చేశామని గుర్తు చేశారు. గత వైసీపీ హయాంలో దొంగ సర్టిఫికెట్లతో అనర్హులకు, ఇంటర్ క్రికెట్ పోటీల్లో కేవలం పాల్గొన్న వారికే సచివాలయ ఉద్యోగాలు కట్టబెట్టిన చరిత్ర జగన్‌ది అని విమర్శించారు.


కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆమోదించిన 65 ఆటల జాబితానే పోర్టల్‌లో ఉంచామని, ఇందులో కూటమి ప్రభుత్వం సొంతంగా చేర్చిన ఆట ఒక్కటి కూడా లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న బొంత రోశయ్య అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందన్నారు. 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో 41A నోటీసులు ఇస్తారనే కనీస చట్ట పరిజ్ఞానం కూడా జగన్‌కు లేకపోవడం విచారకరమన్నారు.


గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన డీఎస్సీ స్కామ్‌పై చర్చించే దమ్ము వైఎస్ జగన్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. కూన రవికుమార్, భరత్‌లపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని... దమ్ముంటే ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.


Bhumireddy Ramgopal Reddy
YS Jagan Mohan Reddy
DSC Teacher Recruitment
Andhra Pradesh Politics
TDP vs YSRCP
Sports Quota Jobs

More Telugu News